మలసీఁ జూడరో మగసింహము
అలవిమీఱిన మాయలసింహము
అదిరో చూడరో ఆదిమపురుషుని
పెదయౌభళము మీఁది పెనుసింహము
వెదకి బ్రహ్మాదులు వేదాంతతతులు
కదిసి కానఁగ లేని ఘన సింహము
మెచ్చి మెచ్చి చూడరో మితిమీఱిన యట్టి
చిచ్చఱకాంతితోడి జిగిసింహము
తచ్చిన వారిధిలోన తరుణిఁ గౌఁగిటఁ జేర్చి
నచ్చిన గోళ్లశ్రీనరసింహము
బింకమునఁ జూడరో పిరితియ్యక నేఁడు
అంకపు దనుజ సంహార సింహము
వేంకటనగముపై వేదాచలముపై
కింకలేక వడిఁ బెరిగినసింహము
సంపుటము 1-13
No comments:
Post a Comment