Monday, 3 September 2018

మా దురితములు వాపి మమ్ముఁగాచుటరుదా ...... అన్నమయ్య సంకీర్తన


మా దురితములు వాపి మమ్ముఁగాచుటరుదా
శ్రీదేవిరమణుఁడు శ్రీ వేంకటేశ

అంబరీషుఁ బైకొన్న ఆపదలన్నియుఁ బాపి
బెంబడిఁ గాచే నీచే పెను చక్రము
అంబరాననున్న ధ్రువ నజ్ఞానమెల్లఁ బాపె
పంచి నీ చేతనుండిన పాంచజన్యము

పక్కన జరాసంధు బలమెల్ల నుగ్గాడి
నిక్కము మధురనిల్పె నీచే గదా
తొక్కి హిరణ్యకశిపుఁ దునిమి ప్రహ్లాదుఁ గాచె
నిక్కి నిక్కి మెరిచేటి నీ ఖడ్గము

విడరావణునిఁ జంపి విభీషణునిఁ గాచె
చిడుముడి పడక నీచే శార్ జ్ఞము
మేడమీక శ్రీ వేంకటేశ నేఁడు నన్నుఁ గాచె
బడిబడి నీ నామ పఠన నేఁదిదిగో

(సంపుటం - 3, సంకీర్తన-434)

Sunday, 2 September 2018

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే...........


జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపిక పతే నయన మోహనా కృష్ణ నీరజేక్షణా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే మదన కోమలా కృష్ణ మాధవా హరే వసుమతీ పతే కృష్ణ వాసవానుజా వరగుణాకర కృష్ణ వైష్ణవాక్రుతే సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే మురహరా విభొ కృష్ణ ముక్తిదాయకా విమలపాలక కృష్ణా వల్లభీపతే కమలలోచన కృష్ణ కామ్యదాయకా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా విమలగాత్రనే కృష్ణ భక్తవత్సలా చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం కువల ఏక్షణా కృష్ణ కోమలాకృతే తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే భువన నాయకా కృష్ణ పావనాకృతే గుణగణోజ్వల కృష్ణ నలినలోచనా ప్రణయవారిధే కృష్ణ గుణగణాకరా దామసోదర కృష్ణ దీన వత్సలా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా కామసుందరా కృష్ణ పాహి సర్వదా నరకనాశన కృష్ణ నరసహాయకా దేవకి సుతా కృష్ణ కారుణ్యమ్భుదే కంశనాశనా కృష్ణ ద్వారకాస్థితా పావనాత్మక కృష్ణ దేహి మంగళం త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలం భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా భక్తదాసనా కృష్ణ హరసు నీ సదా కాదు నింటెనా కృష్ణ శలహెయ విభో గరుడ వాహనా కృష్ణ గోపిక పతే నయన మోహనా కృష్ణ నీరజేక్షన జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా గరుడ వాహనా కృష్ణ గోపిక పతే నయన మోహనా కృష్ణ నీరజేక్షణా జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా

Saturday, 1 September 2018

మలసీఁ జూడరో మగసింహము - అన్నమయ్య కీర్తన





మలసీఁ జూడరో మగసింహము
అలవిమీఱిన మాయలసింహము

అదిరో చూడరో ఆదిమపురుషుని
పెదయౌభళము మీఁది పెనుసింహము
వెదకి బ్రహ్మాదులు వేదాంతతతులు
కదిసి కానఁగ లేని ఘన సింహము

మెచ్చి మెచ్చి చూడరో మితిమీఱిన యట్టి
చిచ్చఱకాంతితోడి జిగిసింహము
తచ్చిన వారిధిలోన తరుణిఁ గౌఁగిటఁ జేర్చి
నచ్చిన గోళ్లశ్రీనరసింహము

బింకమునఁ జూడరో పిరితియ్యక నేఁడు
అంకపు దనుజ సంహార సింహము
వేంకటనగముపై వేదాచలముపై
కింకలేక వడిఁ బెరిగినసింహము

                                                           సంపుటము 1-13

ఊరికే దొరకునా ఉన్నతోన్నత సుఖము............



అన్నమయ్య కీర్తన

ఊరికే దొరకునా ఉన్నతోన్నత సుఖము
సారంబు దెలిసికా జయము చేకొనుట

తలఁపు లోపలి చింత దాఁటినప్పుడు గదా!
అలరి దైవంబు ప్రత్యక్షమౌట,
కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా!
తలకొన్న మోక్షంబు తనకుఁ జేపడుట

కర్మంబు కసటువోఁ గడచినప్పుడు గదా!
నిర్మల జ్ఞానంబు నెరవేరుట,
మర్మంబు శ్రీహరి నీ మఱఁగు చొచ్చినఁ గదా!
కూర్మిఁ దన జన్మ మెక్కుడు కెక్కుడౌట

తనశాంత మాత్మలోఁ దగిలినప్పుడు గదా!
పనిగొన్న తన చదువు ఫలియించుట
ఎనలేని శ్రీ వేంకటేశ్వరుని దాస్యంబు
తనకు నచ్చినఁ గదా దరిచేరి మనుట

                                      (సంపుటం-౦2, సంకీర్తనం-1౦4)

Friday, 3 August 2018

చక్కని తల్లికి చాఁగుబళా.... అన్నమయ్య కీర్తన



‍‌చక్కని తల్లికి చాఁగుబళా తన -
చక్కర మోవికి చాఁగుబళా

కులికేటి మురిపెపుఁ గుమ్మరింపుఁ దన -
సళుపుఁ జూపులకు చాఁగుబళా
పలుకుల సొలపులఁ బతితోఁ గసరెడి
చలముల యలుకకు చాఁగుబళా

కిన్నెరతోఁ బతి కెలన నిలుచుఁ దన -
చన్ను మెఱఁగులకు చాఁగుబళా
ఉన్నతిఁ బతిపై నొరగి నిలుచుఁ దన -
సన్నపు నడిమికి చాఁగుబళా

జందెపు ముత్యపు సరుల హారముల -
చందనగంధికి చాఁగుబళా
విందయి వేంకటవిభుఁ బెనఁచిన తన -
సందిదండలకు చాఁగుబళా

(5వ సంపుటం - 1౦7వ సంకీర్తన)

Tuesday, 1 March 2016

భోజనం తరువాత అరటిపండు తింటే మంచిదా?

అరటి పండు

అభుక్తామలకం శ్రేష్టం
భుక్తాకు బదరీ ఫలం
కదళీ నకలాచన

"అభుక్తామలకం శ్రేష్టం" అంటే ఆమ్లం (ఉసిరి) , అభుక్తా అంటే అన్నం తినకముందు అంటే భోజనానికి ముందు ఉసిరి తినడం చాలా మంచిది.  ఇందులో ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు దాగి ఉన్నాయి. భోజనానికి ముందు ఉసిరి తినడం వలన మనం తిన్న ఆహారం అరగడానికి కావలసిన ఆమ్లాలు స్రవించడానికి ఉసిరి దోహదపడుతుంది. అలాగే ఉసిరి తినడం వలన మనం ఆయుర్వేదంలో చెప్పుకునే త్రిదోషాలు (వాతము, పిత్తము మరియు కఫము) రాకుండా ఉసిరి కాపాడుతుంది. అందుకే మనం రోజూ భోజనానికి ముందు ఉసిరి తినాలి. ఒకవేళ మనకు ఉసిరి అందుబాటులో లేకుంటే ఉసిరి ఊరగాయ నిల్వచేసుకుని రోజూ భోజనంలో తీసుకుంటే చాలా మంచిది. 
" భుక్తాకు బదరీ ఫలం" అంటే భుక్తాకు అంటే భోజనం తరువాత బదరీ ఫలం (రేగి పండు) తినడం వలన కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. 
"అలాగే కదళీ నకలాచన" కదళీ అంటే అరటి పండు. అరటి పండు భోజనం ముందు గానీ, భోజనం మధ్యలో గానీ మరియు భోజనం తరువాత గానీ స్వీకరించడం మంచిది కాదు. అదేంటండి అలా అంటారు అందరూ భోజనం తరువాత అరటి పండు తింటే అరుగుదలకు మంచిది అంటారు మరి మీరు ఇలా చెబుతున్నారు అనొచ్చు. అరటిపండు అరుగుదలకు మంచిదే కానీ భోజనం సమయంలో స్వీకరించడం వలన కఫమును కలిగిస్తుంది. కాబట్టి అరటిపండు భోజనం సమయంలో తప్ప మిగతా సమయంలో సేవించడం మంచిది.

Monday, 15 February 2016

అన్నప్రాసన ఎప్పుడు, ఎలా చేయాలి?


5 నెలల 5 రోజులకు అన్నప్రాసన చేయాలి. ఈ అన్నప్రాసన అమ్మాయి వారి పుట్టింట్లో సహకుటుంబ సమేతంగా దేవునికి నైవేద్యంగా అర్పించిన దానిని తినిపించాలి. ఈ నైవేద్యం ఘ్రుత (నెయ్యి), దధి (పెరుగు), మధు (తేనె), ఓదనం (అన్నం) కలిపి తయారు చేయాలి. ఈ నైవేద్యాన్ని వెండి పళ్ళెంలో ఉంచి బంగారు చెంచాతో గాని లేదా బంగారు ఉంగరంతో గాని తినిపించాలి. మళ్ళీ ఇక్కడ ఎవరు తినిపించాలి అంటే తండ్రి కాని, తల్లి కాని, తాతయ్య కాని, అమ్మమ్మ కాని లేదా మేనమామ కాని తినిపించాలి.